Friday 9 August 2013

ఎవరి దారుల్లో....................

ఎవరి దారుల్లో వాళ్ళం
వేరైపోతున్న సందర్భంలో
ఒకరికి మరొకరం
తోడుగా నిలిచే చోట
మనసులు విప్పారే పూలవుతాయి
పొద్దున్నే పొద్దును
ఆత్మీయంగా ముద్దాడుతాయి .. !

దూరం ఎక్కువయ్యే కొద్దీ
ఆరాటం పెను తుపాను అవుతుంది
గుప్పెడు గుండెను ముంచేస్తుంది
ఒక్కోసారి ఆలోచనలు
కెరటాలై ఉవ్వెత్తున ఎగసి పడుతాయి ..!

పచ్చని పైరుల్లా
గాల్లో ఎగిరే పతంగుల్లా
పరుగులు తీసే ప్రవాహంలా
కళ్ళు కౌగిలింతలై పోతాయి
కమ్మని ఊసులు నేర్పుతాయి .. !

కాలపు సోయగంలో
మనిద్దరం కలిసే సమయాన
నీకోసం నేను వేచి చూడటం
బతుకును రాగరంజితం చేసింది .. !

నీవో వైపు
నేనో వైపు
దారులు వేరైనా
మనిద్దరం ఒకే గమ్యమై
ఒకరి కళ్ళల్లోకి
మరొకరం జొరబడుతూ
పయనించటం గొప్ప
అనుభూతిని ఇస్తుంది ..!

కదిలే జ్ఞాపకాలు
ఒక్కోసారి గాయం చేస్తాయి
ఇంకోసారి అలసిన
శరీరాలకు జోలపాట పాడుతాయి
ప్రేమంటే ఆలింగానమా
అర్పించుకోవటమా ..కానే కాదు
అదో జీవన పోరాటం
బతుకు మర్మాన్ని చేదించే సాధనం
రెండు గుండెల ఆర్తి గీతం .. !

ఏకాంతంలో దేనికోసమో
దేహాలు ఆరాట పడుతాయి
కాలపు సాగరంలో
కలిసిపోయాక .. సొమ్మసిల్లి పోతాయి
అంతా ఇంతే కదా అనుకుని
అమ్మతనం కోసం ఆక్రోసిస్తాయి .. !!

No comments:

Post a Comment