************భవిష్యత్ దృశ్యాలు************
ఇక్కడ చిరకాలపు స్నేహాల చిరునామాలు లేవు
చిరుధరహాసపు పరిచయాలు లేవు
ఉదయాన్నే పలకరించే పిట్ట కూతలు లేవు
మనసారా ఆదరించే కంట స్వరాలూ లేవు
సాటి మనిషి ఆవేదనను కాపాడే గుండె లేదు
పరుగులు తీసే సమాజ అసంగతాలు
అనురాగాన్ని అమ్మకాన్ని పెడుతున్న
అరాచక పరాచకాలు
గుండె బరువును మోయ వీలుకాని
విచిత్ర జీవన గతులు
చెత్త కుండీ చుట్టూ పడి ఉన్న చెత్తలా
చిందరవందరగా ఉన్నాయి
మనిషి ఒక పగటి వేషగాడు
నటనే తప్ప ఆ నోటినుండి కమ్మని పాట వినిపించదు
నిలవడానికి నీడలేకున్న అనంతాకాశంలో
ఆచూకికోసం అయినవాళ్ళనే కోల్పోయి
ఆదమరచి నిద్రిస్తున్న అనుబంధాలకు బాధ తెలియదు
ఎత్తైన కొండలలో
వినిపించే ప్రతిధ్వనుల మధ్య
కనబడని పక్షి గుళ్ళు
వినబడని కోయిల గానాలు ప్రత్యక్షమవుతాయి
వినబడని హృదయ గ్ఘోషల నడుమ
కనిపించే సూర్యచంద్రులు
వినిపించే గాలి అలలు అంతరించిపోతాయి
పనికిరాని సూర్యోదయాన్ని
తరచి చూడలేని చంద్రబింబాన్ని
చేతికందని నక్షత్రాలని
అందుకోలేని అనురాగాన్ని
కరుణించని మానవత్వాన్ని
సృష్టి రహస్యాల్ని
అన్నింటిని మనిషే ఊహించగలడు
నిజం కొంత , అబద్దం మరింత
నిరాశ కొంత, ఆశ మరికొంత
నిరంతరం రెండు నాలుకల మధ్య
ఊగిసలాడే హృదయం
దేన్నీ గమనించకుండా గడచిపోయిన తేదీలను మాత్రమే
గుర్తుచేసుకుంటూ హింసించుకుంటూ
తులనాడుకుంటూ....
ఎవరికంటే ఎవరు గొప్పని బేరీజు వేసుకుంటున్నా
కనబడేది ఒకటే అదే మనల్ని మనమే నమ్మలేనితనం..
అందరికి అందరు కావాల్సిన వాళ్ళమే
అంతులేని ఈ ప్రపంచంలో చదరంగపు పావులమే...
మనిషికి, మనసుకి మధ్య మారిపోయేవి భవిష్యత్ దృశ్యాలే...
అందుకే..
సమాజంలో హాస్యం బతకకున్నాఇతిహాసం జీవించే ఉంటుంది...
శిధిలాలు కంటికింపు కలిగించకున్నా చరిత్ర కోసం నిలిచే ఉంటుంది.
No comments:
Post a Comment